నరకాని నకళ్లు!

దేశీయంగా 1,382 కారాగారాల్లో ఖైదీలు అమానుష పరిస్థితుల్లో బతుకులీడుస్తున్న వైనాన్ని తప్పుపడుతూ ఎప్పటికప్పుడు జైళ్ల నిర్వహణలో మేలిమి సంస్కరణలను సూచిస్తున్న ధర్మాసనం ఈసారి కొన్ని విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. నిందితులకు బెయిలు అనుగ్రహించడం న్యాయమూర్తి విచక్షణాధికార పరిధిలోని అంశమైనా- 'బెయిలు నిరాకరణ సరైనదేనా, బెయిలు షరతుల్ని పాటించే స్తోమత నిందితులకు ఉందా' అన్న అంశాలపై ఆత్మావలోకనం జరగాలన్న ధర్మాసనం సూచన ఎంతో మన్నికైనదిబీ మరెంతో మానవీయమైనది. ఆ తరహా సద్వివేచన దేశవ్యాప్తంగా న్యాయాలయాల్లో ఏ మేరకు నేడు ప్రస్ఫుటమవుతోందోచీకటి కొట్టాల్లో పొగచూరిపోతున్న బడుగుల బతుకులే చెబుతున్నాయి! 'నిందితుల్ని శిక్షించేలా బెయిలును బిగపట్టకూడదు'- ఈ సమున్నత ఆదర్శానికి కోల్ కతా ఉన్నత న్యాయస్థానం దాదాపు తొమ్మిదిన్నర దశాబ్దాల క్రితమే గొడుగు పట్టింది. దర్యాప్తునకు నిందితులు సహకరిస్తున్నా, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం లేకున్నా, మొట్టమొదటిసారి నేరారోపణలు ఎదుర్కొంటున్నా బెయిలు మంజూరును పరిశీలించవచ్చునని తాజాగా 'సుప్రీం' ధర్మాసనం ఉద్బోధిస్తోంది. ఇండియాలోని సుమారు నాలుగు లక్షల పాతిక వేలమంది ఖైదీల్లో మూడింట రెండొంతులకు పైగా విచారణను ఎదుర్కొంటున్నవారే. ప్రపంచవ్యాప్తంగా విచారణ ఖైదీల సగటు 32 శాతంబీ అంతకు రెట్టింపునకు పైగా భారతీయ జైళ్లలో మగ్గిపోవడం దేశీయంగా నేరన్యాయ అవస్థకు దర్పణం పట్టేదే! విచారణ ఖైదీలుగా ఏళ్లూపూళ్లూ కారాగార క్లేశాలు అనుభవిస్తున్నవారిలో 70 శాతం నిరక్షరాస్యులని, 53 శాతం ముస్లిములు, దళితులు, గిరిజనులని అధ్యయనాలు చాటుతున్నాయి. బెయిలు లభించినా పేదరికం కారణంగా పూచీకత్తులు సమర్పించలేక వందల సంఖ్యలో ఖైదీలు కటకటాల్లోనే కమిలిపోతుండటం పట్ల దిల్లీ హైకోర్టు ఏడు వారాల క్రితం ఆవేదన వ్యక్తీకరించింది. తీవ్ర నేరాభియోగాలు ఎదుర్కొంటున్నవారికీ ప్రాథమిక హక్కులు ఉంటాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని విస్మరించజాలమని ఉద్ఘాటించింది. బెయిలు వచ్చినా తిహార్ జైలు దాటిరాని 253 మంది కేసును విచారిస్తూ అలాంటివారికి ఉపశమనం కల్పించేలా విచారణ కోర్టులకు పలు ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత న్యాయపాలికలో కారాగారాల సంస్కరణాభిలాష, ఖైదీలపట్ల మానవీయ స్పందన పదేపదే వ్యక్తమవుతున్నా ఆ న్యాయస్పృహ దిగువ స్థాయి కోర్టుల దాకా ఇంకక పోవడమే- జైళ్లు కిక్కిరిసిపోవడానికి కారణభూతమవుతోంది. డబ్బు డాబు గల ఘరానా నేరగాళ్లు బోరవిరుచుకొని తిరుగుతుంటే, నోరువాయి లేని అభాగ్య నిందితులు కొడిగట్టిన దీపాలయ్యే దుస్థితి రాజ్యమేలుతోంది! కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇటీవల పార్లమెంటులో వెల్లడించిన వివరాల మేరకు- 2015లో 2.82 లక్షలుగా ఉన్న విచారణలోని ఖైదీల సంఖ్య 2016లో మరో నాలుగు శాతం పెరిగి 2.93 లక్షలకు చేరింది. విచారణలోని ఖైదీలంతా నేరం చేసినవాళ్లు అయి ఉండకపోవచ్చు. బెయిలు లభించకో, ఒకవేళ వచ్చినా పూచీకత్తులు సమర్పించలేకో బందిఖానాల్లో మగ్గిపోతున్నారు. ఒకవేళ వాళ్ల దోషిత్వం రుజువైతే పడే శిక్షాకాలాన్ని మించి జైళ్లలోనే మగ్గిపోతున్న లక్షలాది అభాగ్యుల కష్టాలూ కడగండ్లను గమనిస్తే మనసున్న ప్రతి గుండె చెమర్చక మానదు! దిల్లీ హైకోర్టుల్లో దోషిత్వ నిర్ధారణ తీర్పులపై అప్పీలు చేసుకొన్న ఖైదీలకు వారి వ్యాజ్యాల పరిస్థితి, పురోగతి ఎప్పటికప్పుడు తెలియజేయాలని సుప్రీంకోర్టు మొన్ననే ఆదేశించింది. ఆయా కేసుల పురోగతి సమాచారాన్ని, ఇతరత్రా న్యాయసహాయం లభించే అవకాశాల్ని ఖైదీలకు పారాలీగల్ స్వచ్చంద కార్యకర్తలు తెలియజెప్పాలని నిర్దేశించింది. 'సుప్రీం' గడప తొక్కినవారి సంగతి సరేబీ మొదటి అంచె సైతం దాటలేక మౌనంగా రోదిస్తున్న అభాగ్యుల మాటేమిటి? విచారణకు నోచుకోకుండా వివిధ ఆరోపణల కింద గరిష్ట శిక్షాకాలంలో సగం దాకా కారాగారావాసం పూర్తి చేసినవారందరికీ విముక్తి ప్రసాదించాలని 2014 సెప్టెంబరులో సుప్రీంకోర్టు ఆదేశించింది. తదనుగుణమైన శాసన సంస్కరణల కోసం న్యాయసంఘమూ నిర్ణాయక సిఫార్సులు చేసింది. అవన్నీ ఏ గంగలో కొట్టుకుపోయినట్లు? వృద్ధాప్యంలో పడి, నయంకాని వ్యాధుల విష పరిష్వంగంలో చిక్కి, కాటికి కాళ్లు చాపుకొన్న ఖైదీలపట్ల మానవతాదృక్పథంతో వ్యవహరించాలన్న 2006 సెప్టెంబరునాటి ఉమ్మడి హైకోర్టు ఆదేశాల అమలుకూ దిక్కులేదు. మన నేరన్యాయ వ్యవస్థనే బోనెక్కించే స్థాయిలో ఈ మానవ హక్కుల ఉల్లంఘనలు ఇంకెన్నేళ్లు?